Sept 17 speciality | ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి 🔥
సెప్టెంబర్ 17 చారిత్రాత్మక దినం
----------------------------------------------
*🔰1948 సెప్టెంబర్ 17 చారిత్రాత్మకమైన రోజు.*
ఇప్పటి తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలు, మహారాష్ట్ర లోని నాందేడ్, అవరంగాబాద్, బీడ్, పర్భానీ, కర్ణాటక లోని బీదర్, గుల్బర్గా, ఉస్మానాబాద్, రాయచూర్ జిల్లాలతో కూడిన నిజాం రాజ్యం కూలిపోయిన రోజు . ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి అంకురార్పణ జరిగిన రోజు. ముఖ్యoగా చెప్పాలంటే సెప్టెంబర్ 17, నిజాం రాజు భారత సైన్యానికి లొంగిపోయిన రోజు. ఈ కారణంగా ప్రజలపై రజాకార్ల అకృత్యాలు అంతమయ్యాయి.
భారత సైన్యం రావటానికి ముందు నిజాం మద్దతుతో రజాకార్లు ప్రజలపై తమ దాష్టీకాన్ని సాగించారు. జనం సంపద, ప్రాణ, మానాలను దోచుకున్నారు. రక్తపాతం సృష్టించారు. అనేక జిల్లాల్లో జాగీర్దార్లు, భూస్వాములు రజాకార్ల అండతో ప్రజలపై హింసాకాండ సాగించారు. వీరి ఆగడాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పీడిత ప్రజలు సాయుధ పోరాటం ప్రారంభించారు. ఈ ప్రజా ప్రతిఘటనతో వేలాది గ్రామాల నుంచి భూస్వాములు పారిపోయారు. కమ్యూనిష్టుల ప్రభావం ఎక్కువగా వున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాల్లో భూస్వాములు, జాగిర్దార్ల ఆధీనం లోని లక్షలాది ఎకరాల భూములను జనం స్వాధీనం చేసుకున్నారు. దున్నేవాడికే భూమి చెందాలన్న ఆకాంక్ష, నినాధం బలపడింది. ఇంకోవైపు రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడికక్కడ సాయుధులయ్యారు. గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసుకొని రజాకార్లను తరిమికొట్టారు. దాడులు, ప్రతిదాడులతో రాజ్యం రక్తసిక్తం అయింది.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చినా, ఆ తర్వాత సుమారు ఏడాదిపాటు నిజాం రాజ్యం అల్లకల్లోలంగా కొనసాగింది. అనంతరం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ప్రాంతాన్ని దేశంలో విలీనం చేసేందుకు సైన్యం, నిజాం రాజ్యం లోకి ప్రవేశించింది. కాగా, భారత సైన్యం ధాటికి రజాకార్లు, నిజాం సైన్యం తోక ముడిచాయి. గత్యంతరం లేక భారత ప్రభుత్వానికి 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయారు. దీనితో రాజరిక వ్యవస్థ అంతమయింది. ఈ వ్యవస్థ అంతం కావటానికి ముందు ప్రజల తిరుగుబాటుతో పారిపోయిన భూస్వాములు, ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చాక పోలీసుల మద్దతుతో తిరిగి గ్రామాల్లో ప్రవేశించి ప్రజల నుంచి భూములు స్వాదీనం చేసుకోవటం, దౌర్జన్యాలు చేయటం, పెత్తనం చెలాయించటం ఆరంభించారు. ఈ కారణంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో భూస్వాముల వ్యతిరేక పోరాటాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి.
ఈ పరిణామాలన్నీ అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 17ను ఇప్పుడు కొందరు విలీన దినం అని అంటుంటే, మరి కొందరు విమోచన దినమని, ఇంకొందరు స్వాత్రంత్ర దినమని జరుపుతున్నారు. కమ్యూనిస్టులు సాయుధ పోరాట చరిత్రను గుర్తుకు తెస్తుంటే ఇంకొందరు మతపరమైన అంశాలను ముందుకు తెస్తున్నారు. ఏది ఏమైనా సెప్టెంబర్ 17 చారిత్రాత్మకమైన దినం. రాజకీయ, సామాజిక వ్యవస్థల్లో అనేక మార్పులకు అంకురార్పణ జరిగిన దినం. రజాకార్ల అరాచకాల నుంచి స్వేచ్చా వాయువులు పీల్చుకున్న దినం.
Article by : nithish Sirikonda
ఈ విషయాన్ని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి.
